
హైదరాబాద్: అంతర్జాతీయ 5వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై ఏర్పాటుచేసిన యోగా రోడ్ షో లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా వాక్, రోడ్ షో నిర్వహించి యోగాసనాలు వేశారు. యోగాకు సంబంధించిన కరపత్రాలు, పుస్తకాలను విడుదల చేశారు. అనంతరం వీసీ సజ్జనర్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చన్నారు. సమాజంలో అందరూ ఒత్తిడితో సతమతమవుతున్నారన్నారు. ఒత్తిడి రహిత జీవనానికి యోగా దోహదపడుతుందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుషూతో జీవించాలంటే క్రమం తప్పకుండా ప్రతీరోజు యోగా సాధన తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తొలగించుకొని ప్రశాంతమైన జీవితం కొనసాగించువచ్చునన్నారు. సైబరాబాద్ కమీషనరేట్ లో సిబ్బందికి యోగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ విఎస్ అలుగు వర్షిని మాట్లాడుతూ జూన్ 21 న ప్రపంచ యోగా డే ను పురస్కరించుకొని 25వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో యోగా అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ రోడ్ షో లో ఆయుష్ డిపార్ట్మెంట్, ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలల విద్యార్థులు, ఆయుష్ కళాశాలల విద్యార్థులు, ఐటీ కంపెనీల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
