
హైదరాబాద్, నిఘా24 : తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి ఆలయం పున:ప్రారంభ తేదీ ఖరారయింది. మంగళవారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం పున:ప్రారంభ తేదీని ప్రకటించారు. శ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 2022 మార్చి 28వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి ఆలయాన్ని పున: ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందే మార్చి 21న ఆలయ పున:ప్రారంభ అంకురార్పణ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 21 నుంచి ఎనిమిది రోజులపాటు 6 వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించామని, ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమవుతుంది అని అంచనాకు వచ్చినట్లు తెలిపారు. స్వర్ణ తాపడం కోసం ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ విరాళాలు సేకరించి నేరుగా ఆర్బీఐ నుంచి బంగారం కొనుగోలు చేస్తామని తెలిపారు. యాదాద్రిలో భక్తుల కోసం 250 కాటేజీల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని, భక్తుల కోసం అత్యాధునిక బస్టాండ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. కొండమీదకు భక్తులకు ఉచిత బస్సు సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ నృసింహ సాగర్ సమీపంలో 400 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

యాదాద్రి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం త్వరితగతిన పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా యాదాద్రి పుణ్యక్షేత్రం విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఇప్పటికే విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఒక కిలో 16 తులాల బంగారాన్ని, మంత్రి మల్లారెడ్డి కుటుంబం ఒక కిలో, చిన్న జీయర్ స్వామి క్షేత్రం నుంచి ఒక కిలో, మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబం నుంచి ఒక కిలో బంగారం స్వామివారికి విరాళంగా అందజేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రకటించారు.