
శేరిలింగంపల్లి, నిఘా 24 : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గచ్చిబౌలి డివిజన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా నిర్వహించిన ఈ వేడుకలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే చేతులమీదుగా గచ్చిబౌలి డివిజన్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను సాయిబాబా ఘనంగా సన్మానించారు. డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ టీచర్లకు, మున్సిపల్ కార్మికులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఆడపిల్ల పుట్టినప్పటినుంచి పెళ్లి, ప్రసవ సమయంలోను ఒక పెద్దన్న మాదిరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ మహిళలకు మహిళా బంధుగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రసవ సమయంలో కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు.
మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ తమ కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ ధర్మాన్ని కొనసాగిస్తున్న మహిళల శ్రమ వెలకట్టలేనిదని అన్నారు.

రాష్ట్రంలో మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీంతోపాటు తెలంగాణలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకువచ్చి వారికి పూర్తి భద్రతను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి సిఐ గోన సురేష్, రాయదుర్గం సీఐ మహేష్, శేర్లింగంపల్లి మెడికల్ డాక్టర్ శైలజతో పాటు వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, నరేష్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
