
శేరిలింగంపల్లి, నిఘా 24: అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువునంటూ కొండాపూర్ లో ఓ వ్యక్తి మహిళల ఇళ్ల స్థలాలను ఆక్రమించాడు. పోలీసులు, అధికారులు అక్రమణదారుడికే వంత పాడుతుండడంతో బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. అసలు జీహెచ్ఏంసీ రికార్డుల్లో లేని ఇంటి నెంబరుతో భవన నిర్మాణ అనుమతులు తీసుకుని, సదరు నిర్మాణ అనుమతులతో కోర్టు ఆర్డరు తెచ్చుకోని, తమ రెక్కల కష్టంతో కొనుగోలు చేసిన ప్లాట్లను కబ్జా చేశాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధిత మహిళలు ఉప్పరి గోవిందమ్మ, బి.కవిత వివరాల ప్రకారం…
శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్ సర్వే నెంబరు 112/1లోని మారుతీ నగర్ కాలనీలో గల ప్లాట్ నెంబర్ 20లో గోవిందమ్మకు 110 గజాలు, కవితకు 156 గజాల చొప్పున ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. 2018వ సంవత్సరంలో పి. దర్శన్ సింగ్ అనే వ్యక్తి నుంచి తాము ఈ ప్లాట్లను కొనుగోలు చేశామన్నారు. అంతకు ముందు దర్శన్ సింగ్ సదరు ప్లాటును మాజీ డిజిపి భాస్కరరావు భార్య ఏం. పార్వతి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాము కొనుగోలు చేసిన అనంతరం సదరు ప్లాట్లలో ఉన్న గదులను అద్దెకు ఇచ్చి, నెల నెల విద్యుత్ బిల్లులు కడుతున్నామని, ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి ప్రాపర్టీ టాక్స్ కడుతున్నామని తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువునంటూ నిఖిల్ గౌడ్ అనే వ్యక్తి వచ్చి తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని, ప్రహరీ గోడను సైతం కూల్చివేశాడన్నారు. ఈ విషయమై తాము గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. తాజాగా రామచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరిట సర్వే నెంబరు 114/2తో కోర్టు ఆర్డర్ తీసుకువచ్చి పోలీసు బందోబస్తుతో తమ ప్లాట్లను ఆక్రమించారని వాపోయారు.

వారు చెప్పిన సర్వే నెంబరు పొజిషన్ అక్కడ కాకపోయినా.. ప్లాటు బౌండరీలు సరిపోలకపోయినా.. కోర్టు ఆర్డర్ పేరుతో తమ ప్లాటులో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. నకిలీ ఇంటి నెంబర్ సృష్టించి, దాని ద్వారా జిహెచ్ఎంసి నుంచి భవన నిర్మాత నిర్మాణ అనుమతులు పొందారని, సదరు అనుమతులతో కోర్టు ఆర్డర్ తీసుకువచ్చి తమ ప్లాట్లలో ఉన్న గదులను కూల్చివేశారని వాపోయారు. ఈ విషయమై జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా జులై 29న హోమ్ ట్రీ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ అనుమతులు ఇచ్చారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోత్బలంతో అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని వాపోయారు. జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఇచ్చిన భవన నిర్మాణ అనుమతి ఇంటి నెంబర్ మీద ఆర్టిఐ ద్వారా తాము వివరాలు కోరగా, సదరు ఇంటి నెంబరు తమ రికార్డులలో లేదని బదులిచ్చారన్నారు. నకిలీ ఇంటి నెంబర్ తో తమ ప్లాట్లను కబ్జా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు పైసా పైసా కూడా పెట్టి సొంతింటి కోసం కొనుగోలు చేసిన తమ ప్లాట్లను తిరిగి తమకు ఇప్పించాలని వారు కోరుతున్నారు.
