
హైదరాబాద్, నిఘా 24: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ తనను బెదిరిస్తున్నాడని ఓ మహిళ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న తమ భూమిని ఎమ్మెల్యే గాంధీ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ తనను, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని సులోచన అగర్వాల్ అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే గాంధీ మనుషులు తమ ఫ్యాక్టరీ లోపలికి చొరబడి దోపిడీ చేశారని, ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసినా స్పందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఫ్యాక్టరీ లో ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన మెషిన్లను, అల్యూమినియం బండెల్‌లను పోలీసుల సాయంతో ఎమ్మెల్యే గాంధీ దోపిడీ చేసారని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పోలీసు అధికారులు ప్రశాంత్, మల్లేశ్వర్‌లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపాలంటూ పిటిషనర్‌కు సూచించింది. సులోచన అగర్వాల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.
సులోచన ఎవరో నాకు తెలియదు : ఎమ్మెల్యే గాంధీ
తనపై హైకోర్టు లో పిటీషన్ వేసిన సులోచన అగర్వాల్ ఎవరో తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడడం, కలవడం చేయలేదని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. తనపై ఎన్నికల సమయంలో నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, పరువునష్టం దావా వేస్తామన్నారు.