
హైదరాబాద్ : హైటెక్ సిటీ రహదారులు ఓపెన్ బార్లను తలపిస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐటీ కారిడార్ రహదారులు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి లోని వైన్ షాపులు మందుబాబుల ఆగడాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. వైన్ షాపుల ముందు ఉన్న రహదారులు సిట్టింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. వైన్ షాపుల్లో మద్యం కొంటున్న మందుబాబులు షాపుల ముందు ఉన్న రహదారులనే సిట్టింగ్ కేంద్రాలుగా వాడుకుంటున్నారు. ఓపెన్ గా కూర్చొని మద్యం సేవించడం, వాహనాలు నిలిపి అందులో సిట్టింగ్ వేయడం నిత్యకృత్యమైంది. ప్రధాన రహదారుల మీద మందుబాబు లు తిష్ట వేయడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మద్యం మత్తులో ఉన్నవారు గొడవలు పెట్టుకోవడం, దారిన పోయే వారిమీద దాడులు చేస్తున్నారు.
చేష్టలూడిగి చూస్తున్న యంత్రాంగం…
ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని గోపన్ పల్లి, రాయదుర్గం, గచ్చిబౌలి, మియపూర్ ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల ముందు నిత్యం ఇదే పరిస్థితి ఉన్నా అటు ఎక్సఈజ్, ఇటు స్థానిక పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. స్థానిక వైన్ షాపులకు ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో పోలీసులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వైన్ షాపుల ముందు నుంచి మహిళలు వెళ్లాలన్నా భయపడుతుండగా, షాపుల చుట్టుపక్కల ఉండే నివాస గృహాలకు తలనొప్పులు తప్పడం లేదు. మందుబాబుల ఆగడాలు, వైన్ షాపుల ముందు వాహనాల పార్కింగ్ తో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.


