
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కొత్త తంటాలు తెచ్చిపెడుతుంది. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్, దిగజారిన ఆర్థిక పరిస్థితిలో నగరంలో కొత్త పంచాయతీలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సాఫ్టువేర్ ఇలాక శేరిలింగంపల్లిలో ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు, భవన యజమానుల మధ్య వివాదం ముదురుతోంది. అద్దెల విషయంలో ఏర్పడుతున్న వివాదాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల వరకు వెళ్తున్నాయి. రెండు వర్గాలు అసోసియేషన్లుగా ఏర్పడి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో పాటు, ప్రజాప్రతినిధుల వద్ద పంచాయతీలకు వెళ్తున్నారు. హైటెక్ సిటీ చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 600 వరకు ప్రైవేట్ వర్కింగ్ హాస్టల్స్ పనిచేస్తున్నాయి. దాదాపు అన్ని హాస్టళ్లు భవనాలను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఈ అద్దెల మీదే ఆధారపడి భవన యజమానుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. కొంతమంది బ్యాంక్ లోన్లు తెచ్చి ఇళ్ళు నిర్మించిన వారికి, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ అద్దెలే ఆధారం. కాగా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం, సాఫ్ట్వేర్ సంస్థలు వర్క్ ఫ్రొం హోమ్ ఇవ్వడంతో హాస్టళ్లు చాలావరకు ఖాళీ అయ్యాయి. దీనితో హాస్టల్ నిర్వాహకులు తాము అద్దెలు చెల్లించలేమని చేతులు ఎత్తేశారు. అసోసియేషన్ గా ఏర్పడి అద్దెలు చెల్లించవద్దని తీర్మానించారు. కాగా అద్దెల మీదనే ఆధారపడిన భవన యజమానులు అద్దె చెల్లించాలని, లేదంటే ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో హాస్టల్ నిర్వాహకులు, భవన యజమానుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు హాస్టల్ నిర్వాహకులు భవన యజమానుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో, భవన యజమానులు సైతం అసోసియేషన్ గా ఏర్పడి వీరు పిర్యాదు చేశారు. తాజాగా కొండాపూర్ లో ఉన్న ఓ హాస్టల్ వివాదం పోలీసు స్టేషన్, స్థానిక ప్రజాప్రతినిధి వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ తమకు అన్యాయం జరిగిందని భవన యజమానులు భావిస్తుండడంతో వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
