
హైదరాబాద్, నిఘా24: నగర శివారులోని జంటజలాశయాల రక్షణ కోసం రూపొందించిన జీఓ 111 ఉందా… లేదా… అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ వైపు భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతుండగా, మరోవైపు నీళ్లు లేక జంట జలశయాలు వెలవెలబోతున్నాయి. దీనికి కారణం చెరువుల రక్షణ మరిచిన మన నాయకులు, అధికారులు జీఓ 111 పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోహహిస్తుండడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ పక్కనే ఉన్న గౌలిదొడ్డికి అనుకొని జీఓ 111 పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలే ఇందుకు నిదర్శనం. వట్టినాగులపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న ఈ నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో జీఓ 111 కచ్చితంగా అమలు కాగా, మున్సిపాలిటీగా మారిన వెంటనే కనుమరుగైనట్టు కనిపిస్తుంది. ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా గ్రామాలు, కాలనీలు పుట్టుకువస్తున్నాయి. అసలు నిర్మాణాలకు అనుమతులే లేని జీఓ 111 పరిధిలో ఏకంగా భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు, ఆకాశ హర్మాలు వెలుస్తున్నాయి.

ముఖ్యంగా ఇక్కడ వెలుతున్న నిర్మాణాల్లో దాదాపు అన్నీ వాణిజ్య సముదాయాలే కావడం గమనార్హం. ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం సమకూరకుండా గండికొడుతూ కొందరు నేతలు, అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐటీ కారిడార్ కు అనుకొని, ఇంత బాహాటంగా వందల సంఖ్యలో నిర్మాణాలు వెలుస్తున్నా, జీఓ 111 పరిధిలో బహుళ అంతస్థులతో కొత్తగా కాలనీలు పుట్టుకువస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం నుంచి కనీస స్పందన లేకుండా పోయింది. నిర్మాణాలకే అనుమతి లేని భూముల్లో కేవలం 200గజాల విస్తీర్ణంలో 5,6 అంతస్థుల భవనాలు వెలుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరు నాయకులు, అధికారులు తమ జేబులు నింపుకోవడం కోసం అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే హైదరాబాద్ వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు త్వరలోనే కనుమరుగు కావడం ఖాయం.
