
శేరిలింగంపల్లి, నిఘా24 : శేరిలింగంపల్లిలో అక్రమ నిర్మాణాలకు అడ్డుండడం లేదు. అడ్డుకోవలసిన అధికారుల అవినీతికి అంతుండడం లేదు. మహా నగర పాలక సంస్థ గుడ్డిదవడంతో లోకమంతా కనిపిస్తున్న అక్రమ నిర్మాణాలు అధికారుల కంటికి మాత్రం కనిపించడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రవేశపెట్టిన న్యాక్ వ్యవస్థ సైతం అదే అవినీతి బురదలో కూరుకుపోవడంతో హైటెక్ సర్కిల్ లో అనుమతి లేని నిర్మాణాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్రమ నిర్మాణాలను సహించేది లేదంటూ నేతలు, అధికారులు చేసే ప్రకటనలు ఊకదంపుడు ఉపన్యాసాలుగా మారుతున్నాయి. అడ్డుకోవలసిన అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోద్భలంతోనే శేరిలింగంపల్లిలో అక్రమ నిర్మాణాల తంతు కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా వెలుస్తున్న ఆకాశ హార్మ్యాలు అధికారుల అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎక్కడో ఒకటీ, అరా తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టినా, పక్షం రోజులు తిరిగే సరికి కూల్చిన కట్టడాలు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. గ్రేటర్ ఆదాయానికి గండి కొడుతూ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది తమ జేబులు నింపుకొనేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో శేరిలింగంపల్లిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కరువవడంతో హైటెక్ మండలంలోని వివాదాస్పద భూముల్లో సైతం అద్దాల మేడలు వెలుస్తున్నాయి.

ఎటుచూసినా అక్రమ నిర్మాణాలే…
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, శ్రీరామ్ నగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, గచ్చిబౌలి, టెలికాం నగర్, రాయదుర్గం, మధురానగర్ కాలనీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నా అడ్డుకోవలసిన టౌన్ ప్లాన్ విభాగం అధికారులు, న్యాక్ బృందాలు తమకు పట్టనట్టు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కిందిస్థాయి సిబ్బందితో వసూళ్లకు పాల్పడుతూ అధికారులే నిర్మాణదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో చైన్ మెన్ స్థాయి నుంచి సర్కిల్ ఉన్నతాధికారి వరకు అనుమతి లేని నిర్మాణాలకు సహకరిస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేరుకే న్యాక్…
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం కోసం తీసుకువచ్చిన న్యాక్ బృందం పేరు గొప్ప అన్న చందంగా మారింది. న్యాక్ నోడల్ అధికారిని తొలగించి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కే బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేని, అక్రమ అంతస్థులు ఒకఎత్తైతే, వివాదాస్పద భూముల్లో వెలుస్తున్న నిర్మాణాలు మరో ఎత్తు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గోపన్ పల్లి ఎన్టిఆర్ నగర్, గౌలిదొడ్డి కేశవ నగర్ లలో వెలుస్తున్న నిర్మాణాలు ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయని తెలుస్తుంది. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు ప్రభుత్వ స్థలంలో జానెడు గుడిసె వేసుకుంటే రాత్రికి రాత్రే కూలుస్తుండగా, వివాదస్పద, ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్న ఆకాశ హార్మ్యాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మన నేతలు, అధికారులే సమాధానం చెప్పాలి.