
హైదరాబాద్: గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో పార్కింగ్ వాహనాలకు కొంతమంది పిపిఆర్ (PPR) టాక్స్ వసూలు చేస్తున్నారు. కొత్తగా ఈ పీపీఆర్ ఏంటి అనుకుంటున్నారా.! PPR- పొలిటికల్, పోలీస్, రెవిన్యూ టాక్స్. కొత్తగా ఉంది కదా…
ఎక్కడా వినలేదు కదా… కానీ నగరానికే తలమానికంగా నిలుస్తున్న గచ్చిబౌలిలో ఓ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కొందరు ట్రాఫిక్ పోలీసులు, కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది కలిసి నెలనెలా చేస్తున్న అక్రమ వసూళ్ల పర్వమిది. పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణికులను ఔటర్ మీదుగా తీసుకువస్తున్న తుఫాన్ వాహన డ్రైవర్ల జేబులకు చిల్లుపెట్టి, వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని తమ జేబులు నింపుకుంటున్నారు. జడ్చర్ల, వికారాబాద్, అమనగల్ వంటి సుదూర ప్రాంతాల నుంచి నగరానికి ప్రయాణికులను తీసుకువచ్చే తుఫాన్ వాహనాలు, పలు సాఫ్ట్వేర్ సంస్థలకు ఉద్యోగులను తీసుకువచ్చే మినీ బస్సులను రోజంతా డ్రైవర్లు నానక్ రాంగూడ రామానాయుడు స్టూడియో ముందు ఉన్న చెరువు శిఖం స్థలంలో పార్కింగ్ చేస్తుంటారు. కాగా అక్రమ పార్కింగ్ చేస్తున్నారని ఈ వాహనాల డ్రైవర్లను భయపెడుతున్న కొంతమంది వీరివద్ద నుంచి నెలవారి వసూళ్లు చేపడుతున్నారు. దాదాపు 100 వాహనాలకు ఒక్కో వాహనం నుంచి నెలకు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు సమాచారం. కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని చెప్పుకొనే ఓ పార్టీ నాయకులు, కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, కొందరు ట్రాఫిక్ పోలీసులు కలిసి ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఓ యూనియన్ పేరుతో అమాయక డ్రైవర్ల వద్ద నెలకు దాదాపు లక్ష రూపాయల పైచీలుకు వసూలు చేసి పంచుకుంటున్నారు. నెలనెలా వీరికి డబ్బు ఇవ్వని వాహనాల డ్రైవర్లను ఇబ్బందులు పెట్టడం, వాహనాలు పార్కింగ్ చేయకుండా అడ్డుకోవడం చేస్తున్నట్లు సమాచారం. కాగా గత సంవత్సర కాలంగా ఈ వసూళ్ల పర్వం కొనసాగుతుండగా, ఈ మధ్యకాలంలో పంపకాల్లో ఏర్పడిన విబేధాల కారణంగా విషయం బయటపడటం చర్చనీయాంశంగా మారింది.