
హైదరాబాద్ : రోజురోజుకు తెలంగాణ రాష్ట్రం కరోనా హబ్ గా మారుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 1లక్ష టెస్టులు చేస్తే, అందులో 20 వేల పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలో టెస్టులు చేసిన ప్రతి 5గురిలో ఒకరికి పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. శుక్రవారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,04,118 టెస్టులు చేయగా, అందులో 20,462 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం అత్యధికంగా 1892 కేసులు నమోదు కావడం, అందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే 1658 కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే 10వేల కేసులు నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్రం కరోనా హబ్ గా మారుతుందని అర్థం అవుతుంది. జూన్ 24వ తేదీన 10వేల మార్కును దాటిన కేసుల సంఖ్య జూలై 3కు 20వేలను దాటడం విశేషం.
దీంతో పాటు మృతుల సంఖ్య 283కు చేరుకుంది. శుక్రవారం మరో 8మంది మహమ్మారి కారణంగా మృతిచెందారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ కలవర పెడుతుంది. రోజు రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 90శాతం గ్రేటర్ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో మొత్తం 9984 ఆక్టివ్ కేసులు ఉండగా, 10,195మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.