
హైదరాబాద్, నిఘా 24: శుక్రవారం రాత్రి అందరు విద్యార్థులతో పాటు హాస్టల్ గదిలో నిద్రపోయిన చదువుల బిడ్డ తెల్లవారేసరికి తాను చదువుతున్న తరగతి గదిలోనే విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని… బ్లడ్ క్యాన్సర్ చివరిదశ కావడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భిన్న సూసైడ్ నోట్ లు చనిపోయిన విద్యార్థి బ్యాగులో లభించడం అనుమానస్పదంగా మారింది. ఐటీ కారిడార్ కు ఆనుకొని ఉన్న గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా చారకొండకు చెందిన లింగారాపు వంశీకృష్ణ(17) గౌలిదొడ్డిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా లాక్డౌన్ అనంతరం ఈమధ్యే కళాశాల ప్రారంభం కాగా, ఫిబ్రవరి 2వ తేదీన వంశీకృష్ణ కాలేజీకి తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు అందరూ విద్యార్థులతో కలిసి హాస్టల్ గదిలో నిద్రకు ఉపక్రమించిన వంశీకృష్ణ శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు చూడగా బైపీసీ క్లాస్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. అదే గదిలో ఉన్న వంశీకృష్ణ కాలేజీ బ్యాగ్ తనిఖీ చేయగా రెండు పేజీల సూసైడ్ నోట్ లభించింది. ఓ పేజీలో “లైంగిక వేధింపుల కారణంగా మనశ్శాంతి లేకుండా పోయిందని… ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గనిపిస్తోంది అని… అమ్మ- నాన్న, టీచర్లు, స్నేహితులు తనను క్షమించాలని” రాసి ఉండడం, మరో పేజీలో “భగవంతుడా నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు… అడిగిన చిన్న కోరికను తీర్చడం లేదు… నాకు బ్లడ్ క్యాన్సర్ చివరి దశలో ఉంది అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను… “అంటూ రాసి ఉండడం అనుమానస్పదంగా మారింది. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మృతుని బంధువులు సోషల్ వెల్ఫేర్ కళాశాలకు వచ్చి ఆందోళనకు దిగారు.

తాము లేకుండా మృతదేహాన్ని ఏ విధంగా తరలిస్తారని ప్రశ్నించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, ఎటువంటి సమస్యలు లేవని వాపోయారు. 10వ తరగతిలో 10గ్రేడ్ సాధించి ఇంటర్ లో అడుగుపెట్టిన కుమారుడు కాలేజీ గదిలోనే ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాగా మొత్తం ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిజానిజాలు వెలికి తీస్తామని తెలిపారు.