
హైదరాబాద్, నిఘా24: తెలంగాణలో పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యం అక్రమ మార్గాన పక్క రాష్ట్రాలకు తరలివెళ్తుంది. కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి రేషన్ బియ్యాన్ని కర్ణాటక బీదర్ కు తరలిస్తుండగా, చందానగర్ లో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో చందానగర్ గంగారాంలోని ఆర్ఎస్ బ్రదర్స్ సమీపంలో లారీని అడ్డుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 229 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ బియ్యం రవాణా సూత్రధారులు, కూకట్పల్లి కి చెందిన షేక్ సుల్తావుద్దీన్, షేక్ జావేద్ లను సైతం అరెస్ట్ చేశారు. బియ్యం తరలిస్తున్న లారీ, లారీకి ఎస్కార్టుగా ముందు వెళ్తున్న కారును, 40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
