
హైదరాబాద్, నిఘా24: మరో రెండు రోజుల్లో తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుంది. ఈ సంవత్సరం వానాకాలం పంటల పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జూన్ 15వ తేదీ నుంచి రైతుబంధును జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈ సీజన్‌లో సొమ్ము అందుకునే వారి సంఖ్య 61.55 లక్షలుంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత యాసంగిలో 59.33 లక్షల మందికి ఈ పథకం సొమ్ము అందుకోగా, కొత్తగా 2.22 లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పలు బ్యాంకులు విలీనమైన కారణంగా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు గతంలో ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా డబ్బు జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.