
హైదరాబాద్, నిఘా24: గత రెండు రోజులుగా భూముల వేలంతో జోరుమీదున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ తగిలింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విక్రయించిన ఖానామెట్ గోల్డెన్ మైల్ లేఔట్ లోని ప్లాటు నెంబర్ 17 వేలాన్నీ నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖానామెట్ లోని స్మశానవాటికను కలుపుకొని సిద్ధం చేసిన ప్లాటు నెంబర్ 17 మీద స్థానికులు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు స్థలం స్మశానవాటిక కావడం, అందులో సమాధులు ఉండడంతో స్థానికులు ఆందోళనలకు దిగారు. కానీ స్థానికుల అభ్యంతరాలు, ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ భూమిని వేలం వేయడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శుక్రవారం సాయంత్రం ప్లాటు నెంబర్ 17 వేలం ప్రక్రియను నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసింది. కాగా ప్రభుత్వం కోర్టు తీర్పు వెలువరించేకంటే ముందే ప్లాటు నెంబర్ 17ను వేలం వేసింది. వేలంలో ప్లాటు నెంబర్ 17లోని 2 ఎకరాల భూమిని ఎకరాకు 46.20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 92.40కోట్ల రూపాయలకు లింక్ వెల్ సంస్థ కు విక్రయించింది. మరోవైపు స్థానికుల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు వేలం ప్రక్రియ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.