
శేరిలింగంపల్లి, నిఘా24: నగరంపై విరుచుకుపడిన భారీ వరదల కారణంగా నష్టపోయిన పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నగదు పంపిణీ వివాదాస్పదంగా మారుతుంది. నష్టపోయిన ప్రజలకు10వేల రూపాయల ప్రభుత్వ తక్షణ ఆర్థిక సాయం నిర్ణయం మంచిదే. కానీ క్షేత్ర స్థాయిలో దాని అమలు విమర్శలకు తావిస్తోంది. వరదలతో నష్టపోయిన వారి జాబితా రూపకల్పనలో, సహాయం అందిస్తున్న తీరుతో ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. ముఖ్యంగా వరదల్లో నిజంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం అందడం లేదని, నాయకులు ఎంపిక చేసిన వారికే నగదు పరిహారం అందుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ సహాయాన్ని ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులో, విధుల్లో ఉండే అధికారులో అందించకుండా, అధికార పార్టీ నాయకులు అందించడం వివాదాస్పదం అవుతుంది. బల్దియా ఎన్నికలకు ముందు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని కొంతమంది అధికార పార్టీ ఆశావహులు బాహాటంగా ప్రచార అస్త్రంగా వాడుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది. అసలు ఈ పంపిణీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పార్టీ నాయకుల చేతుల మీదుగా ఏ విదంగా పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పేరుకు ఒక అధికారి ని వెంటబెట్టుకుని కొందరు నాయకులు, తమకు ఇష్టం వచ్చిన వారికి నగదు అందజేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొందరు కిందిస్థాయి నాయకులు అసలు లబ్ధిదారులను వదిలిపెట్టి, కొందరితో వారి వాటా మాట్లాడుకుని వారికే అందజేస్తున్నారని, నగదు ఇచ్చిన కొద్దిసేపట్లోనే తమ వాటా వసూలు చేసుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరుగవలిసిన పంపిణీ అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లడంతోనే వివాదం మొదలయ్యింది. ఏ అధికారంతో ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఒక పార్టీ నాయకులు అందజేస్తూ, ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరదల కారణంగా నష్టపోయిన నగర ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం రాజకీయ, ప్రచార రంగు పులుముకొని, అసలైన లబ్ధిదారులకు అందకుండా పోతుంది.