
హైదరాబాద్ : ఆకలవుతుంది, బుక్కెడన్నం పెట్టండి అంటే… వచ్చే నెలలో పెళ్ళిఉంది, బిర్యానీ పెడుతా… అన్నట్టు ఉంది తెలంగాణ ప్రభుత్వ తీరు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తూ రోజురోజుకు ఆసుపత్రుల్లో పడకల కొరత అధికం అవుతుంటే, కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను మాత్రం ప్రారంభించడం లేదు. గత మూడు నెలలుగా ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడూ, అప్పుడూ అంటూ ప్రకటనలు ఇస్తున్నా, వాస్తవంగా ఇప్పటి వరకు టీమ్స్ లో కరోనా చికిత్స ప్రారంభం కాలేదు. మార్చ్ 28న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గచ్చిబౌలి భవనాన్ని కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నామన్నారు. ఏప్రిల్ 7న మంత్రులు కెటీఆర్, ఈటల వచ్చి త్వరలో ప్రారంభం అన్నారు. ఏప్రిల్ 13న సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనికి టిమ్స్ గా పేరు పెట్టారు. ఏప్రిల్ 25న సెంట్రల్ కమిటీ వచ్చివెళ్లింది. కానీ ఆసుపత్రిలో కరోనా చికిత్స లేదు, కేవలం ఓపి సేవలు అన్నారు. చివరికి జూన్ 24న మంత్రి వచ్చి, ఆసుపత్రిలోనే ప్రెస్ మీట్ పెట్టి, 4 రోజుల్లో ఇన్ పేషేంట్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. కానీ నేటికీ ప్రకటనలే మిగిలాయి. ఓ వైపు పాజిటీవ్ కేసులు పెరిగి, ఆసుపత్రుల్లో పడకలు దొరకక, కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హోమ్ క్వారంటైన్ అంటూ అధికారులు చేతులు దులుపుకుంటుండగా, ఆసుపత్రిలో ఉంచండి అని అడిగితే చీత్కారాలు, చీదరింపులు ఎదురవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. తాజాగా ఆసుపత్రిలో చేర్చండి అని అడిగినందుకు శేరిలింగంపల్లి మండల వైద్య అధికారి దురుసుగా మాట్లాడిన ఆడియో వివాదాస్పదంగా మారగా, ప్రస్తుత పరిస్థితులను తెలియజేస్తుందని ప్రజలు వాపోతున్నారు.
