
హైదరాబాద్, నిఘా24 : తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం చూపిస్తుంది. గతంలో కేవలం గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన కేసులు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం విస్తరించాయి. ఏకంగా రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో 100పైచిలుకు కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1986 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. మహమ్మారి కారణంగా కొత్తగా ఒకేరోజు 14మంది మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 519కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 10,632మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. కొత్తగా 816మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 45,388మంది చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా గతంలో కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే భారీగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం గ్రేటర్ లో తగ్గుముఖం పట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ లలో 100పైచిలుకు కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.
