
గచ్చిబౌలి, నిఘా 24: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో గచ్చిబౌలి టిఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ముఖ్యంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన వారికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గాంధీ పిలుపుకు స్పందించి రక్తదానం చేసిన గచ్చిబౌలి డివిజన్ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి, రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా ఆదర్శవంత పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు జాతిపితగా నిలుస్తున్నారని అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం అభినందనీయమని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రతిఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారిలో గచ్చిబౌలి డివిజన్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, రాజు ముదిరాజ్, దారుగుపల్లి సతీష్ తదితరులు ఉన్నారు.
