
హైదరాబాద్ : తెలంగాణలోని వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే 27 గ్రామాలతో ప్రారంభం కానుంది. మొదటగా పైలెట్ ప్రాజెక్టు కింద 27 గ్రామాల్లో భూముల డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా, ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో డిజిటల్ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.