
హైదరాబాద్, నిఘా 24: ఆన్ లైన్ గేమ్స్ కు బానిసగా మారిన ఓ 10వ తరగతి విద్యార్థి చదువుపై దృష్టి కేంద్రీకరించలేక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మై హోమ్ బుజాలో చోటుచేసుకున్న ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగుడా ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న రేయన్ష్ రెడ్డి(14) మై హోమ్ భుజా అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఎప్పుడూ ఆన్ లైన్ గేమ్స్ తో కాలం గడిపే రేయన్ష్ సదరు గేమ్స్ కు బానిసగా మారాడు. ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడడంతో పాటు చదువుపై ద్రుష్టి కేంద్రీకరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో ఒత్తిడితో మంగళవారం తాను నివాసం ఉంటున్న మైహోం బుజాలోని జే బ్లాక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎత్తైన భవనంపై నుంచి దుకడంతో తీవ్ర గాయాలైన రేయన్ష్ అక్కడికక్కడే మృతి చెందాడు. 10వ తరగతి చదువుతున్న రేయన్ష్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపగా, కుమారుడి మృతితో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.