
హైదరాబాద్, నిఘా24: ఐటీ కారిడార్ పరిధిలోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ హోస్పైస్ నూతన సెంటర్ నేడు ప్రారంభం కానుంది. ఖాజాగూడ ప్రధాన రహదారికి అనుకొని, ఔటర్ కు సమీపంలో నిర్మించిన 82 పడకల స్పర్శ సెంటర్ ను శనివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. క్యాన్సర్ రోగి జీవితం చివరి దశలో స్వాంతన చేకూర్చేందుకు స్పర్శ హోస్పైస్ సెంటర్ పనిచేస్తుంది. క్యాన్సర్ కు సంబంధించిన చికిత్స ముగిసినా.. జబ్బు తగ్గకుండా మరణానికి దగ్గరైన వారికి, క్యాన్సర్ ను చివరి దశలో గుర్తించి… చికిత్స అందించినా ఉపయోగం లేదని డాక్టర్లు తేల్చిన రోగులకు అన్నీ తామై అండగా నిలుస్తోంది స్పర్శ హోస్పైస్ సెంటర్.
రోగి చివరి రోజుల్లో మానసిక ప్రశాంతత, రోగానికి సంబంధించిన నొప్పి పోగొట్టే విధంగా ఈ సెంటర్ లో చికిత్స, సేవలు అందించనున్నారు. 2011లో నగరంలోని బంజారాహిల్స్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ సంస్థ కేవలం12పడకల సామర్థ్యంతో సేవలు అందేంచేది. చాలి చాలని వసతుల మధ్య, పూర్తి స్వచ్ఛంద సేవతో నడుస్తున్న స్పర్శ సెంటర్ నేడు సువిశాల కొత్త సముదాయానికి మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఖాజాగూడలో స్పర్శ హోస్పైస్ సెంటర్ కోసం 1.1 ఎకరాల భూమిని కేటాయించగా, ఇందులో 60వేల ఎసెఫ్టీతో 82 పడకల సామర్ధ్యంతో ఈ సెంటర్ ను నిర్మించారు. దీన్ని శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.