
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య వివాదానికి దారి తీసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు సోమవారం కొత్తగూడ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అధికార టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్, జగదీశ్వర్ గౌడ్ లు హాజరయ్యారు.

కాగా ప్రతిపక్ష బిజెపి నుంచి ఎన్నికైన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడంతో వివాదాస్పదం అయింది. మండల స్థాయి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఆహ్వానించి… బిజెపి కార్పొరేటర్ ను ఆహ్వానించకపోవడంతో బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి నాయకులు సమావేశం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారులు, స్థానిక నాయకులు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మారుస్తున్నారని మండిపడ్డారు.