
హైదరాబాద్, నిఘా 24: హైటెక్ మండలంగా పేరుగాంచిన శేరిలింగంపల్లిలో రెవెన్యూ అధికారుల వింత వైఖరితో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను చూసి చూడనట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు… స్థానిక ప్రజలు ఆలయాలు నిర్మించుకుంటే మాత్రం ఉక్కు పాదం మోపుతున్నారు. ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న పురాతన దేవాలయాన్ని ఓ సామాజిక వర్గానికి చెందిన స్థానికులు పునర్నిర్మానం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయం ఆవరణలో అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం పనులు చేపడుతుండగా అడ్డుకున్న రెవెన్యూ అధికారులు నిర్మాణ పనులను కూల్చి వేశారు. జెసిబిలతో గోడలు, ప్రహరీలను నేలమట్టం చేశారు. మరోవైపు ఖాజాగూడ పక్కనే ఉన్న గచ్చిబౌలిలో ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించి వాణిజ్య సముదాయం ఏర్పాటు చేసిన బడాబాబులకు వంతపాడుతున్న రెవెన్యూ అధికారులు పుణ్యకార్యం కోసం చేపడుతున్న దేవాలయం మీద మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నారు.

ఖాజాగూడలో ఆలయ నిర్మాణ పనులు నీలమట్టం…
శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ ప్రధాన రహదారికి అనుకొని, సర్వేనెంబర్ 27లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎన్నో సంవత్సరాలుగా కాటమయ్య గుడి ఉంది. ఓ సామాజిక వర్గం వారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా కాటమయ్య దేవాలయాన్ని పెద్దగా నిర్మించడంతోపాటు పక్కనే వనమైసమ్మ ఆలయ నిర్మాణానికి పనులు చేపట్టారు. కాగా సదరు స్థలం ప్రభుత్వ స్థలం అంటూ పనులను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు, బుధవారం ఆలయ నిర్మాణ పనులతో పాటు ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. ఈ కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భారీ భవన నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులకు వంత పాడుతున్న రెవెన్యూ అధికారులు, ఆలయ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తున్నారని విమర్శించారు.
గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకొని ప్రభుత్వ స్థలం ఆక్రమణ…

ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న దేవాలయంపై విరుచుకుపడిన రెవెన్యూ అధికారులు, పక్కనే ఉన్న గచ్చిబౌలిలో ప్రధాన రహదారికి ఆనుకొని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా స్పందించడం లేదు. గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్ కు ఆనుకొని సర్వే నెంబరు 91 లో ఉన్న ఖాళీ స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి తాత్కాలిక గదుల నిర్మాణం చేపట్టాడు. సదరు నిర్మాణాల్లో లేబర్ క్యాంపు ఏర్పాటు చేసి నెలనెలా భారీ ఎత్తున అద్దె వసూలు చేస్తున్నా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులు ఏకంగా తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసి యదేచ్చగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన రహదారి ఆనుకొని ఇంత తతంగం జరుగుతున్నా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం ఈ కబ్జాల మీద చర్యలు తీసుకోవడం లేదు. గచ్చిబౌలి ప్రభుత్వ స్థలం ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ఒకే మండలంలో ఉన్న రెండు పక్క పక్క గ్రామాల ప్రభుత్వ భూముల విషయంలో అధికారుల ద్వంద వైఖరి వారి అవినీతికి అద్దం పడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు.
