
శేరిలింగంపల్లి, నిఘా24: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం శేరిలింగంపల్లిని అతలాకుతలం చేసింది. పేరు గొప్ప… ఊరు దిబ్బ.. అన్న చందంగా హైటెక్ నియోజకవర్గం సొగసుల ముసుగు తొలగించింది. భారీ వర్షం నియోజకవర్గ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. చెట్లు, ప్రహరీ గోడలు నెలకూలాయి. ఉప్పెనలా వరద నీరు బస్తీలు, కాలనీలను ముంచెతింది. ఇల్లు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. లింగంపల్లి నాలా ప్రవాహంలో ఇద్దరు కొట్టుకుపోయారనే వార్తలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. లింగంపల్లి నాలా నీరు ముంచెత్తడంతో లింగంపల్లి మార్కెట్ నీట మునిగింది. రాయదుర్గంలో ఇళ్ల లోకి నీరు చేరడంతో స్థానికులకు రాత్రంతా జాగారం తప్పలేదు. గోపన్ పల్లిలో రహదారులు నీట మునుగడంతో పాటు ఇళ్లలోకి నీరు చేరాయి. లింగంపల్లి అండర్ బ్రిడ్జి నదిని తలపిస్తుంది. బ్రిడ్జి కింద నుంచి రాకపోకలు నిలిచిపోగా, నాలా ఉధృతంగా రహదారి మీద ప్రవహిస్తోంది. దీంతో పాపిరెడ్డి నగర్ కు రాకపోకలు నిలిచిపోయాయి. హఫీజ్ పెట్ కాయిదమ్ము కుంట నిండి వరద నీరు జెపి నగర్ ను ముంచెత్తింది. ఖాజాగుడ చెరువు నీరు కింద ఉన్న కాలనీ లను జలాదిగ్బందంలో ఉంచింది.

మధీనగూడను ముంచెత్తిన వరద…
భారీ వర్షం కారణంగా మధీనగూడను వరద నీరు ముంచెత్తింది. జాతీయ రహదారి మీద వరద నీరు నదిని తలపించింది. వరద నీరు రామకృష్ణ నగర్ ను ముంచెత్తడంతో కాలనీ జలాదిగ్బంధంలో ఉండి పోయింది. కాలనీలోని అపార్ట్ మెంట్ల లోకి నీరు చేరడం, రహదారులు చేరువుల్లా మారడంతో కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి.

ఏళ్లుగా ఇదే పరిస్థితి…
ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది రామకృష్ణ నగర్. కాలనీ పక్కనే చెరువు లేదు… నాలా పరివాహక ప్రాంతం కాదు… కానీ వర్షం పడిందంటే కాలనీ ముంపుకు గురికావలసిందే. ఎవరో చేసిన పాపానికి, అధికారుల నిర్లక్ష్యానికి స్థానికులు శిక్ష అనుభవిస్తున్నారు.
మధీనగూడ జాతీయ రహదారి మీదుగా ప్రవహిస్తోన్న వరద నీటి కారణంగా రామకృష్ణ నగర్ ముంపుకు గురవుతుంది. ఇక్కడి నాలా మరమ్మతు పనులు సంవత్సరాలుగా కొనసాగుతున్న కారణంగా వరద నీరు కాలనీకి శాపంగా మారుతుంది. ప్రతిసారి ప్రజాప్రతినిధులు రావడం… వరద నీటిలో సహాయక చర్యల పేరుతో ఫోటోలు దిగడం… ఇదే తంతు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు గతంలో ఈ పరిస్థితిని చూసిన వారే. కానీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు.
హైటెక్ ముంపు ప్రాంతం…
మన పాలకులు రోజు ప్రచారం చేసుకునే హైటెక్ వసతులు మొత్తం లోటెక్ అని వర్షంతో తేటతెల్లం అయ్యింది. వెలుగుల బ్రిడ్జిలు కాదు… వర్షం పడితే వరద ముంపులేని ఇళ్ళు కావాలని స్థానికులు కోరుకుంటున్నారు.
