
శేరిలింగంపల్లి, నిఘా24: ప్రజా సమస్యల మీద పోరుబాట పట్టాల్సిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కబ్జాలపై కన్నేశాడు. ఏకంగా సొంత పార్టీ కార్యాలయాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మార్తాండ నగర్, ప్రేమ్ నగర్ లో ఉన్న సిపిఐ కార్యాలయాలను మండల కార్యదర్శి కనకమామిడి శ్రీశైలం గౌడ్ కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతోపాటు స్థానికులు ఈ కబ్జా భాగోతం పై పోలీసులను సైతం ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన సిపిఐ అగ్రనాయకులు కనకమామిడి శ్రీశైలం గౌడ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం శేరిలింగంపల్లి సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీశైలం గౌడ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మార్తాండ నగర్, ప్రేమ్ ప్రేమ్ నగర్ లో ఎన్నో దశాబ్దాలుగా సీపీఐ కార్యాలయాల స్థలాలు ఉన్నాయి. దివంగత సీపీఐ నాయకుడు రక్తపు నాగేష్ గౌడ్ హయాంలో వీటిలో నిర్మాణం చేపట్టి, పార్టీ కార్యాలయాలుగా మార్చారు. నాగేష్ గౌడ్ మరణం అనంతరం మండల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీశైలం గౌడ్ వీటి కబ్జాకు పథకం వేశాడు. తన పేరిట, తన భార్య పేరిట ఈ కార్యాలయాలకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, పార్టీ దిమ్మలను తొలగించి కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పాటు వాటిని అమ్మే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సొంత పార్టీ కార్యకర్తలు, స్థానికులు శ్రీశైలం గౌడ్ మీద పార్టీ అగ్ర నాయకులకు, పోలీసులకు పిర్యాదు చేసారు. దీనితో రంగంలోకి దిగిన సీపీఐ అగ్ర నాయకులు శ్రీశైలం గౌడ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
