
శేరిలింగంపల్లి, నిఘా24: ఐటీ గడ్డ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. అక్రమ నిర్మాణాలను పర్యవేక్షించాలిసిన కిందిస్థాయి సిబ్బంది చేతివాటం… అధికారుల అవినీతి… ప్రజాప్రతినిధుల అండదండలు… వెరసి శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ నిర్మాణదారులకు ఆయాచిత వరంగా మారాయి. ప్రస్తుతం శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ నిర్మాణాల పండుగ నడుస్తుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన టీఎస్ బిపాస్ కు, పాత డిపిఎస్ కు మధ్య సంధికాలం నడుస్తుండడంతో అక్రమాలు హైటెక్ సిటీలో ఆకాశాన్ని అంటుతున్నాయి. పిర్యాదులొస్తే న్యాక్ బృందం పేరు చెప్పి తప్పించుకుంటున్న స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో వసూళ్లు చేయిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

మరోవైపు నిర్మాణదారులు సైతం అధికారులు అడిగినంత ముట్టజెప్పి నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్నారు. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనం ఇస్తున్నాయి. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ, రాఘవేంద్రకాలనీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్లో ఒక్కటీ సక్రమ నిర్మాణం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

విస్తుగొలుపుతున్న న్యాక్ గణాంకాలు…
కాగా టిఎస్ బిపాస్ తో రంగంలోకి దిగిన న్యాక్ బృందం దృష్టికి వచ్చిన ప్రస్తుత అక్రమ నిర్మాణాల లెక్కలు విస్తుపోయేలా చేస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ లో న్యాక్ బృందం పరిశీలించిన 500 నిర్మాణాల్లో కేవలం 51 నిర్మాణాలు మాత్రమే నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నట్టు తేల్చారు. మిగిలినవన్నీ అక్రమ నిర్మాణాలే కాగా ఇందులో 55 నిర్మాణాలను ఎన్ఫోర్స్ మెంట్ బృందం కూల్చివేసింది. మరో 91 నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంది. 286 అక్రమ భవనాలకు నోటీసులు జారీ చేయగా, మరో 12 భవనాలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా మరో 33భవనాలు లాగిన్ లో పెండింగ్ లో ఉన్నాయి. టిఎస్ బిపాస్ కింద అనుమతించిన భవనాలైతే ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసే అవకాశం ఉండగా, ఈ నిర్మాణాలన్నీ పాత డిపిఎస్ విధానంలో కావడంతో నోటీసులు జారీ చేస్తున్నారు.
