
హైదరాబాద్, నిఘా 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు రెండవ విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మరో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి రెండవ విడతలో 500 ఇళ్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రా పద్ధతిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మరో 500 మంది లబ్ధిదారులను డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 21వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నారు.
రెండవ విడతలో మంజూరైన మొత్తం 500 ఇళ్లలో వికలాంగులకు 24, ఎస్సీ లకు 83, ఎస్టీ లకు 29, ఇతరులకు 364 చొప్పున డ్రా ద్వారా ఎంపిక చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు మొదటి విడతలో ఇప్పటికే 500మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, రెండవ విడతలో మరో 500మందిని ఎంపిక చేశారు. దీంతో శేరిలింగంపల్లిలో ఇప్పటి వరకు ఈ పథకానికి మొత్తం 1000 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు.

కలక్టరేట్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, ప్రభాకర్ రావు, పలువురు నగర ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా తీసి లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక పథకాలలో ఒకటి అని అన్నారు. మొదటి దశలో 11,700 ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామని, ఈనెల 21వ తేదీన రెండవ దశలో మరో 13,300 ఇండ్లను అందించనున్నామని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎంతో పారదర్శకంగా జరుగుతుందని, ఎంపికైన లబ్ధిదారులు ఎవ్వరికీ ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరం లేదన్నారు.