
హైదరాబాద్, నిఘా 24: నేటి యువత సోషల్ మీడియా మీద ఎక్కువ కాలం గడుపుతున్నారని, కొంతమంది సోషల్ మీడియాతో తమ పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారని టిఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసీ.సజ్జనార్ అన్నారు. జెఈఈ తో పాటు ఇతర ఎంట్రన్స్ టెస్టులకు శిక్షణ ఇచ్చే రెసోనెన్స్ కళాశాల తమ కాలేజ్ ఫెస్ట్ ‘రెసోఫెస్ట్’ ను శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఫెస్ట్ లో నగరంలోని రెసోరెన్స్ బ్రాంచ్ లలో చదువుతున్న 5వేల మంది విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెసోఫెస్ట్ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన కల్చరల్, స్పోర్ట్స్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు టిఎస్ఆర్టీసీ ఎండి విసి.సజ్జనార్, నటుడు అడవి శేష్, దర్శకుడు తేజలు హాజరై బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటో విద్యార్థులు ముందు తెలుసుకోవాలన్నారు. నేటి విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లు, గాడ్జెట్ ల మీద కాకుండా తమ సమయాన్ని బయటి ప్రపంచంతో, గ్రౌండ్ లలో గడపాలని సూచించారు. విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, జీవితంలో విజయం సాధించడం మీద దృష్టి పెట్టాలన్నారు.

నటుడు అడవి శేష్ మాట్లాడుతూ తనకు పదమూడేళ్ల వయస్సులో సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని తల్లిదండ్రులకు చెప్పి, నటనను రికార్డ్ చేసి తల్లిదండ్రులకు చూపించానన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేస్తారని, మన లైఫ్ లో ఎంత విజయం సాధించినా కన్నవారిని మర్చిపోవద్దని అన్నారు.

దర్శకుడు తేజ మాట్లాడుతూ తన ముందున్న విద్యార్థులంతా తనకంటే బాగా చదువుకున్న వారేనని, తాను 4వ తరగతి డ్రాప్ ఔట్ అన్నారు. పడిపోయినప్పుడు తిరిగి లేచి నడవగలిగితే విజయం దిశగా పయనించవచ్చని అన్నారు. కార్యక్రమంలో రెసోరెన్స్ ఎడ్యు వెంచర్స్ ఎండీ అర్ కె.వర్మ, హైదరాబాద్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, డాక్టర్ రఘురామ్, జియో తెలంగాణ సీఈఓ కెసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.