
జాగో శేరిలింగంపల్లి – 1
శేరిలింగంపల్లి, నిఘా 24 : అదే మండలం… అదే సర్వే నెంబరు… అదే రెవెన్యూ అధికారులు… కానీ అధికారుల వైఖరిలో ద్వందనీతి. నాడు ప్రభుత్వ స్థలమంటూ హీరో ప్రభాస్ ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు నేడు ప్రభాస్ ఇంటి గోడకు అనుకొని చేపడుతున్న భారీ బహుళ అంతస్థుల నిర్మాణం మీద మాత్రం మౌనం దాలుస్తున్నారు. భూబకాసురుల అక్రమాలను అడ్డుకోవలసిన రెవెన్యూ అధికారులు చేతులు ముడుచుకోగా, అక్రమ నిర్మాణాలను అరికట్టవలసిన టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం అక్రమార్కులకు వంతపాడుతూ కళ్లు మూసుకుంటున్నారు. పైసా పేకో.. తమాషా దేకో.. అన్న చందంగా రాయదుర్గం ప్రభుత్వ స్థలంలో వెలుస్తున్న భారీ బహుళ అంతస్థుల నిర్మాణం శేరిలింగంపల్లి రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం పాన్ మక్తాలోని నందీహిల్స్ లో హీరో ప్రభాస్ ఓ ఇంటిని కొన్నేళ్ల క్రితం నిర్మించారు. సదరు ఇళ్ళు సర్వే నెంబర్ 46 లోని ప్రభుత్వ స్థలంలోకి వస్తుందని చెప్పి స్థానిక రెవెన్యూ అధికారులు బాహుబలి ఇంటిని గతంలో సీజ్ చేసి తాళం వేశారు. ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన ఇంటి మీద నాడు రెవెన్యూ అధికారులు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. దీనిపై ప్రభాస్ కోర్టుకు వెళ్లడంతో కోర్టులో కేసు నడుస్తుండగా, తన ఇంటి స్థలాన్ని జీవో 59 కింద రెగ్యులరైజ్ చేయాలని ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును సైతం అధికారులు తిరస్కరించారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా నాడు సంచలనమైంది.

ప్రభాస్ ఇంటి పక్కనే నేడు భారీ అక్రమ నిర్మాణం…
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన అదే సర్వే నెంబరు 46లో ప్రభాస్ ఇంటి గోడకు అనుకొని కొందరు బడాబాబులు భారీ అక్రమ నిర్మాణం చేపడుతున్నా రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. ఏకంగా 52 పిల్లర్లతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి భూబకాసురులు భారీ నిర్మాణం చేపడుతుండగా, అడ్డుకోవలసిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సర్వే నెంబరు పక్కనే ఉన్న 5/3 సర్వే నెంబరులో సైతం కోర్టు వివాదాలతో నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇటువంటి ప్రదేశంలో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం అడ్డుకోవడం లేదు. స్థానికులు ఈ అక్రమ నిర్మాణం మీద పిర్యాదు చేసినా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదు.

దీనికి కారణం శేరిలింగంపల్లికి చెందిన బడా ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వంతో అక్రమార్కులు, శేరిలింగంపల్లి అధికారులు చేసుకున్న చీకటి ఒప్పందమే కారణమనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అక్రమ నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోవాలి : శోభన్
రాయదుర్గం సర్వే నెంబర్ 46లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకుని ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఏం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి చల్లా శోభన్ డిమాండ్ చేశారు. గతంలో ఈ అక్రమ నిర్మాణాన్ని అనుకొని ఉన్న హీరో ప్రభాస్ ఇంటిని సీజ్ చేసిన అధికారులు నేడు 52 పిల్లర్లతో చేపడుతున్న భారీ భవనంపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇప్పటికైనా శేరిలింగంపల్లి రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోవాలని, సదరు భవనాన్ని పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు.