
హైదరాబాద్, నిఘా 24: ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన అధికార పార్టీ మియాపూర్ కార్పొరేటర్ సొంత డివిజన్ ప్రజల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీకి మద్దతుగా ప్రచారానికి వచ్చిన మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను సొంత డివిజన్ ప్రజలే నిలదీశారు. బిఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా సోమవారం మియాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సుభాష్ చంద్రబోస్ నగర్ కు ప్రచారానికి వెళ్లిన కార్పొరేటర్ ను స్థానిక ప్రజలు నిలదీశారు. తమకు అంగన్వాడీ లేదని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ కార్పొరేటర్ మీద స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనుల కోసం అధికారులను ప్రశ్నిస్తే కార్పొరేటర్ పేరు చెప్తారని, కార్పొరేటర్ ను ఎప్పుడు కలిసేందుకు ప్రయత్నించినా అందుబాటులో ఉండడని స్థానికులు వాపోయారు. ఒక్కసారిగా స్థానికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో అక్కడే ఉన్న కార్పొరేటర్ ఖంగుతిన్నాడు. దీంతో అక్కడే ఉన్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కలగజేసుకుని స్థానికులకు సర్ది చెప్పారు. కాగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మీద గతంలో సైతం డివిజన్ ప్రజలు బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేయడం విశేషం. తాను ఎన్నికైన మియాపూర్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఎమ్మెల్యేతో కలిసి ఇతర డివిజన్లలో పర్యటిస్తాడనే ప్రచారం మియాపూర్ కార్పొరేటర్ మీద ఉంది.