
పటాన్ చెరు, నిఘా 24 : రాజకీయ నాయకుల అత్యుత్సాహం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజలకు అండగా నిలవాల్సిన నాయకులే వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన ఓ కాంగ్రెస్ నాయకుడి తీరుపై ప్రజలంతా దుమ్మెత్తి పోస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు భూ ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు, అమీన్పూర్ మాజీ సర్పంచ్ కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఓ ప్రెస్‌మీట్ పెట్టాడు. అది కూడా తహసీల్దార్ ఆఫీస్ గేటు ముందు నడీ రోడ్డులో. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఆ దారిలో కాట శ్రీను ప్రెస్‌మీట్ హంగామా దాదాపు మూడు గంటలు నడవడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రెస్ మీట్ కు వచ్చిన కాంగ్రెస్ లీడర్ల కార్లు, వారి అనుచరుల వాహనాలన్నీ రోడ్డుకు అడ్డంగా పెట్టి మరీ రోడ్డుపైనే ప్రెస్‌మీట్ తతంగం జరపడంతో అటు భీరంగూడ కమాన్ నుండి ఇటు అమీన్పూర్ చౌరస్తా వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

మిట్ట మధ్యాహ్నం మండే ఎండలో రెండున్నర గంటల పాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఒంటి పూట బడులు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం పిల్లలను తీసుకురావాల్సిన తల్లిదండ్రులు కాట శ్రీను తీరుపై మండిపడ్డారు. నడి రోడ్డుపై ప్రెస్‌మీట్ పెట్టి, రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేయడం ఏమిటని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మెసెజ్ ఇస్తారని ప్రశ్నించారు. మీటింగ్ పెట్టిన గంట తరువాత తహసీల్దార్ ఆఫీసు సమీపంలో రెండు అంబులెన్సులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో ప్రజలు మరింత అసహనానికి లోనయ్యారు. గంట పాటు ఆ ట్రాఫిక్‌లో నుండి అంబులెన్సులను బయటపడేసేందుకు స్థానికులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కొంతమంది పాత్రికేయులు ఈ విషయంపై కాట శ్రీనుని ప్రశ్నించగా వారిపై కూడా అనుచితంగా ప్రవర్తించాడు. మా ఇష్టం అంటూ మీరేమి రాసుకుంటారో రాసుకొమ్మంటూ వారిపైనే చిందులు వేశాడు. చివరకు కొంతమంది మీడియా ప్రతినిధుల సమాచారంతో పోలీసులు అక్కడకి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రెస్‌మీట్ పెట్టుకోవాలంటే ఎక్కడైనా అనువైన ప్రదేశం చూసుకోవాలి కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డుపై ప్రెస్మీట్లు ఏంటని ప్రతి ఒక్కరూ కాట శ్రీను తీరును విమర్శిస్తున్నారు.
