
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసులకు వచ్చిన ఓ చిన్ని ఆలోచన వేలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. నేరాల నియంత్రణలొనే కాదు, సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ముందుంటున్నారు సైబరాబాద్ పోలీసులు. నిలువ నీడ లేక సరైన తోడ్పాటు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఆసరా కల్పించే ఉద్దేశ్యంతో సైబరాబాద్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ స్మైల్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ మేరకు బుధవారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ విసీ.సజ్జనార్ ఆపరేషన్ స్మైల్ వివరాలు వెల్లడించారు. గత సంవత్సర కాలంగా ఆపరేషన్ స్మైల్ ద్వారా మొత్తం 581 మంది చిన్నారులను రక్షించారు. వీరంతా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేయడం, చిత్తుకాగితాలు ఎరుకొని, బాల కార్మికులుగా పని చేసే చిన్నారులు. 5నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు చిన్నారులను రక్షించిన స్మైల్ వలేంటీర్లు వారిని పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల హోమ్ లలో ఉంచి చదివిస్తున్నారు. స్మైల్ కార్యక్రమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్మైల్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారిని అభినందించారు.
