
హైదరాబాద్ : కరోనా లాక్ డౌన్ వేళ శేరిలింగంపల్లిలో అధికారులు హనుమాన్ దేవాలయం కూల్చివేత చేపట్టారు. రహదారి విస్తరణ పేరుతో అక్షయ తృతీయ రోజు హనుమాన్ దేవాలయాన్ని నేలమట్టం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ ముందు రహదారి పక్కన పురాతన ఒంటి హనుమాన్ దేవాలయం ఉంది. కాగా రహదారి విస్తరణ పేరుతో గత సంవత్సరం క్రితం ఈ దేవాలయాన్ని కూల్చివేసేందునకు ప్రయత్నించారు. పాక్షికంగా కూల్చివేయగా, స్థానికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీనితో స్థానికులకు క్షమాపణలు చెప్పిన అధికారులు దేవాలయాన్ని పునర్నిర్మించారు. కాగా లాక్ డౌన్ వేళ ప్రజలు రహదారుల మీదకు రారని భావించిన అధికారులు ఆదివారం దేవాలయాన్ని కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నల్లగండ్ల, గోపన్ పల్లి రహదారి మూసివేసి కూల్చివేతలు చేపట్టారు. దేవాలయాన్ని కూల్చివేసి, హనుమాన్ విగ్రహాన్ని గోపన్ పల్లి రంగనాథ స్వామి దేవాలయం గుట్ట మీద ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, దీనికి స్థానిక ప్రజాప్రతినిధి సైతం పచ్చజెండా ఊపినట్లు సమాచారం.