
హైదరాబాద్, నిఘా 24 : గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని మైహోం భూజా వినాయకుడి లడ్డూ వేలం పాటలో రికార్డులు సృష్టించింది. ఏకంగా 25.50లక్షల ధర పలికి అల్ టైమ్ హై నెలకొల్పింది. మై హోమ్ భుజా అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలం పాటలో ఇదే కమ్యూనిటీలో నివాసం ఉండే ఉన్నతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఏదులకంటి చిరంజీవి గౌడ్, సునీత దంపతులు 25.50లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. దీంతో అత్యంత ఖరీదైన వినాయకుడి లడ్డుగా మై హోమ్ భుజా గణనాథుడి లడ్డూ నిలిచింది. వేలంలో సొంతం చేసుకున్న లడ్డూను అసోసియేషన్ సభ్యులు చిరంజీవి గౌడ్ దంపతులకు అందజేశారు. గత సంవత్సరం సైతం మైహోం భుజా లడ్డూ 20.50 లక్షల ధర పలుకగా, వ్యాపారవేత్త మోటూరి నాగబాబు సొంతం చేసుకున్నారు. 2021లో మై హోమ్ భుజా గణేశుడి లడ్డూ ను 18.50లక్షల రూపాయలకు విజయ్ భాస్కర్ రెడ్డి వేలంలో సొంతం చేసుకున్నారు.
