
హైదరాబాద్, నిఘా24: నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. అచ్చం సినిమా ఛేజింగ్ ను తలపించిన ఘటన చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. గురువారం హైడ్రామాల మధ్య అబ్బాయి, అమ్మాయిని వేరు చేయడంతో పాటు అబ్బాయి ని కిడ్నాప్ చేసి హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఆదే ప్రాంతానికి చెందిన యువతిని జూన్ లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను కలిసిన వీరు గచ్చిబౌలి టిఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా గురువారం సినిమాను తలపించే ఛేజింగ్ లు జరిగినట్టు సమాచారం. అబ్బాయి, అమ్మాయి ఉంటున్న టిఎన్జీఓ కాలనీ నుంచి మాట్లాడుదామని అమ్మాయి కుటుంబ సభ్యులు వారిని తీసుకువెళ్లినట్టు సమాచారం. మధ్యలో గోపన్ పల్లి వద్ద కొత్త జంట కారులో నుంచి బయటకు దూకి తమకు సహాయం చేయాలని అభ్యర్తించడం, కొందరు కారులో వచ్చి అబ్బాయిని అక్కడి నుంచి కిడ్నప్ చేసి తీసుకువెళ్లినట్టు తెలిసింది. సంఘటన జరుగుతున్న సమయంలో గచ్చిబౌలి మొబైల్ పోలీసులు వచ్చినా, వారు సరైన సమయంలో స్పందించలేదని స్థానికులు అంటున్నారు. దీనితో అబ్బాయిని ఒక కారులో సంగారెడ్డి వైపు, అమ్మాయి ని మరో కారులో చందనగర్ వైపు తరలించినట్టు సమాచారం. కాగా తెల్లవారే సరికి అబ్బాయి సంగారెడ్డిలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులే అబ్బాయిని హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలి పోలీసులు సక్రమంగా స్పందించి ఉంటే హత్య జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
