
శేరిలింగంపల్లి, నిఘా24: “ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు”… తయారైంది మియాపూర్ పటేల్ చెరువు పరిస్థితి. సుందరీకరణ పనుల పేరుతో చేపట్టిన మరమ్మత్తు చెరువు ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా మార్చింది. ఒకవైపు భారీ వర్షాలతో ఊళ్ళో ఉన్న చెరువులన్ని నిండి కట్టలు తెగుతుంటే, సాక్షాత్తు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ దత్తత తీసుకున్న చెరువులో చుక్క నీరు లేక నెర్రెలు పట్టింది. చెరువు చుట్టుపక్కల వరద పోటెత్తింది… ఇళ్ళు మునిగాయి… రోడ్లు జలమయమయ్యాయి… కానీ పటేల్ చెరువులోకి చుక్క నీరు చేరలేదు. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా, సుందరీకరణ పేరుతో చేపట్టిన పనులు చెరువులోకి చుక్క నీరు రాకుండా చేశాయి. దాదాపు 12కోట్ల రూపాయలు ఖర్చుతో మూడేళ్ళ పాటు చేపట్టిన సుందరీకరణ పనులు చివరికి చెరువును ఎండబెట్టాయి.

సుందరీకరణకు ముందు నీటితో పటేల్ చెరువు
సాక్షాత్తు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మియాపూర్ పటేల్ చెరువును దత్తత తీసుకున్నారు. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువుకు 12.5 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఒకటికి పదిసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి పనులు పర్యవేక్షించారు. మూడేళ్లుగా పనులు కొనసాగాయి.

ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న పటేల్ చెరువు మ్యాప్
కాగా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నగరంలో భారీ వర్షాలు కురిసినా, పటేల్ చెరువులో చుక్క నీరు లేకుండా పోయింది. చెరువులోకి చేరవలసిన వరద చుట్టుపక్కల ఇళ్ల మీదకు పోటెత్తడంతో సమీప కాలనీలు జలమయమయ్యాయి. చెరువులో నీళ్లు లేకుండా చేసే సుందరీకరణ ఎందుకోసమో అధికారులకు, అమాత్యులకే తెలియాలి. ఇంతటి వర్షాల్లోనూ ఎండిపోయిన పటేల్ చెరువును చూస్తున్న స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కబ్జాలతో సగానికి చేరిన చెరువును పూర్తిగా కనుమరుగు చేస్తారా అని అనుమానిస్తున్నారు.
