
హైదరాబాద్ : ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో గల సుమధుర నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపును సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు. లేబర్ క్యాంపులో నివాసం ఉంటున్న దాదాపు 400మంది కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు ఉంటున్న వసతి ప్రాంతంలోని పలువురు నిర్వాహకులతో మంత్రి మాట్లాడారు. మరో రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా ఉండాలని, ప్రభుత్వ లాక్ డౌన్ ను పాటించాలని కూలీలను కోరాడు. కూలీలకు అవసరమైన సౌకర్యాలను అందించాలని నిర్మాణ సంస్థతో పాటు స్థానిక అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్న వలసకూలీల యోగక్షేమాలు తెలుసుకునేందుకు మంత్రి ఈ పర్యటన చేపట్టారు. ఒరిస్సా, బెంగాల్, బీహార్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కూలీలను నేరుగా కలుసుకొని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వారికి అందుతున్న ఆహారం, రే షన్ సరుకుల గురించి ప్రత్యేకంగా వాకబు చేశారు. ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిందిగా సూచించారు. మంత్రితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
