
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని శనివారం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఇప్పటికే కరోనా క్వారంటైన్ కేంద్రంగా కొనసాగుతున్న స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని క్రిటికల్ కేర్ ఐసీయూ కేంద్రంగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రంలో
1500 బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. 3 వేల మందికి అవసరం అయిన నీళ్ళ టాంక్ లు, 10 లక్షల లీటర్ల నీరు పట్టే విధంగా సంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యాధునిక నల్లాలు ఏర్పాటు చేయాలని, అవసరం అయితే తాత్కాలిక బాత్ రూం ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యత ఉన్న పరికరాలు మాత్రమే వాడాలని, బెడ్స్, కాట్స్ శుభ్రం చేయాలని సూచించారు. స్టాఫ్ కి అవసరమైన ఏర్పాట్లు, పెద్ద సంస్థకు భోజన కాటరింగ్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లో మూడు ఫ్లోర్ లు, మరో మూడు రోజుల్లో మరో మూడు ఫ్లోర్ లు సిద్ధం చేయాలని కోరారు. 20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఐసీయూ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇవ్వన్నీ అవసరం పడకపోవచ్చు, కానీ ముందుజాగ్రత్త గా సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రెడ్ జోన్ లు లేవు..
నగరంలో రెడ్ జోన్ లు ఎక్కడా లేవన్నారు. పాతబస్తిలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చింది అని, కాంటాక్ట్ లేకుండా కరోనా సోకలేదన్నారు.