
హైదరాబాద్ : దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు తరలి వెళ్తుండగా హైదరాబాద్ కు మాత్రం తిరిగి వస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుండి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్ కు శుక్రవారం చేరుకున్నారు. వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ లు పర్యవేక్షించారు. తిరిగి వచ్చిన వలస కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రైతు బందు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. హైదరాబాద్ కు వచ్చిన వలస కూలీలు ప్రదానంగా రైస్ మిల్లులలో పనిచేయడానికి వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కూలీలను నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేటలకు ప్రత్యేక బస్సులలో తరలించారు. వచ్చిన కూలీలకు వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం సంబంధిత జిల్లాలకు పంపించారు. కూలీలకు మంచినీరు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు, అందచేశారు.

