
శేరిలింగంపల్లి : గోపన్ పల్లి రంగనాథనగర్ భూ వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఐటీ కారిడార్ కు అనుకొని ఉన్న గోపన్ పల్లిలో గల రంగనాథనగర్ కాలనీ లే అవుట్ మీద ఎన్నో సంవత్సరాలుగా వివాదం కొనసాగుతుంది. కాగా ఈ వివాదాస్పద లే అవుట్ మీద కొంతమంది భూకబ్జాదారులు కన్ను వేయడంతో తరచు వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా ఇక్కడి ప్లాటు విషయమై ఓ మహిళా లాయర్ కుటుంబం మీద ఓ వ్యక్తి దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళా లాయర్ గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కొండాపూర్ శ్రీరాం నగర్ కాలనీకి చెందిన గుంజి పాల్ ను అరెస్ట్ చేశారు. నిందితుని మీద ఐపిసి సెక్షన్ 341,354,506,34 ప్రకారం కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. కాగా గుంజి పాల్ మీద గతంలోనూ పలు భూకబ్జా ఆరోపణలు రాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. గోపన్ పల్లి రంగనాథనగర్ ప్లాట్ల విషయంలో తరచు వివాదాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేని, కోర్టు వివాదంలో కొనసాగుతున్న ఇక్కడి ప్లాట్లను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి.