
హైదరాబాద్, నిఘా24: శేరిలింగంపల్లిలో అధికార యంత్రాంగం ఆదమరిచి నిద్రపోతుంటే, కబ్జాదారులు మాత్రం కబ్జాలతో చెలరేగి పోతున్నారు. కాదేదీ కబ్జాకు అనర్హం అన్న చందంగా నిండ నీటితో కళకళలాడుతున్న చెరువులను సైతం పూడ్చి కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే భారీగా మట్టి, బండరాళ్లు వేసి చదునుచేయడం.. మరోరోజు రేకుల గదులు నిర్మించి కబ్జాను పరిపూర్ణం చేయడం.. ఇదే జరుగుతుంది శేరిలింగంపల్లిలో. లక్షల ప్రజాధనం ఉపయోగించి చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేసినా, వాకింగ్ ట్రాక్ లు నిర్మించినా, చెరువుల రక్షణ కోసం వాచ్ టవర్లు ఏర్పాటు చేసినా కబ్జాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గోపన్ పల్లిలోని పెద్ద చెరువు దుస్థితే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబర్ 33లో చిన్నపెద్ద చెరువు 22 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో చెరువు ఎఫ్టిఎల్ ను ఆక్రమించి నిర్మించిన అపార్టుమెంట్లు, ఇళ్లతో చెరువు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చెరువు చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్ల నిర్మాణం చేపట్టింది. కానీ ఇవేవి కబ్జాలను అడ్డుకోలేకపోతున్నాయి.

మట్టినింపి చెరువును పూడ్చిన కబ్జాదారులు…
తాజాగా నిండ నీటితో ఉన్న చెరువులో మట్టినింపి కబ్జాకు స్కెచ్ వేశారు అక్రమార్కులు. కబ్జాదారుల ధాటికి చెరువు చుట్టు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ కొద్దిదూరం కనిపించకుండా పోయింది. ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ లను తొలగించి మట్టినింపి చదును చేసిన అక్రమార్కులు, నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. చెరువు కబ్జాపై స్థానిక రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో ఈ విధంగా వెలిసిన నిర్మాణాలు పాతబడి పోగా, మరోసారి సరికొత్త నిర్మాణాలకు కబ్జాదారులు తెగబడుతున్నారు. చెరువు రక్షణ కోసం ఈ చెరువులో ఏర్పాటుచేసిన వాచ్ టవర్ చూసి మురిసే చందంగా మారింది. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువును కాపాడుతారని ఆశిద్దాం.
