
శేరిలింగంపల్లి, నిఘా24: కూలిన శిథిలాల మధ్యే బసవతారక నగర్ బస్తీ వసూలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అకస్మాత్తుగా కట్టుబట్టలతో రోడ్డున పడిన వీరు ఎక్కడికి వెళ్లాలో తెలియక, కూలిన తమ గూడు ఆవరణలోనే గడుపుతున్నారు. ఓ వైపు కూలిన ఇటుకలు, విరిగిన కర్రల మధ్య చంటి పిల్లలు, వృద్దులతో అష్టకష్టాలు పడుతున్నారు. పగలంతా ఎండకు ఎండుతూ… రాత్రి చలికి వణుకుతున్నారు.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో ఉన్న ప్రభుత్వ భూమిలో గత 30ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని. ఖాళీ చేయించేందుకు రెవెన్యూ యంత్రాంగం బుధవారం కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్న దాదాపు 220 గుడిసెలు, పాక్షిక నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు తమ నివాసాలను కూల్చివేయడంతో ఈ బస్తీ పేదలంతా రోడ్డున పడ్డారు. కూలిన శిథిలాల మధ్య స్థానికులకు రాత్రంతా జాగారం తప్పలేదు.

వంట చేసుకునే అవకాశం పక్కన పెడితే, కనీసం తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వీరికి తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి కనీస సమాచారం లేకుండా, 30ఏళ్ల నుంచి ఉంటున్న తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా తమ ఇళ్ళు కూల్చివేయడం దుర్మార్గమని, తమకు న్యాయం జరిగే వరకు సదరు స్థలాన్ని ఖాళీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెపుతున్నారు. గురువారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు వీరిని పరామర్శించారు.
