
శేరిలింగంపల్లి, నిఘా 24: ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వస్తున్న కొంతమంది నాయకులు రాబందులుగా మారి ప్రభుత్వ ఆస్తులు, ఆదాయానికి ఎసరు పెడుతున్నారు. రాజకీయ పలుకుబడితో అంగబలం, అర్ధభలాన్ని ఉపయోగించి అందినకాడికి దోచుకుంటున్నారు. కొండాపూర్ కు చెందిన ఓ నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ పలుకుబడితో అక్రమాలకు తెరలేపారు. గ్రేటర్ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహించడం, సొంతంగా అక్రమ నిర్మాణాలు చేపడుతూ పబ్బం గడుపుతున్నారు. రాజకీయ అండదండలతో జిహెచ్ఎంసీ అధికారులను ప్రసన్నం చేసుకొని ఏకంగా కొండాపూర్ లో సదరు నాయకుడు చేపడుతున్న అక్రమ వాణిజ్య సముదాయం షెడ్డు వీరి అక్రమాలకు ఉదాహరణగా నిలుస్తుంది. గతంలో కొండాపూర్ కే చెందిన రెండు చెరువుల అన్యాక్రాంతలో పాలుపంచుకున్నారనే ఆరోపణలు ఉన్న ఈ నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు నేడు జిహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ హై టెన్షన్ రోడ్డులో ఓ భారీ షెడ్డు నిర్మాణం చేపట్టాడు ఓ పార్టీ నాయకుడు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. అక్రమ పద్దతుల్లో ఈ షెడ్డు నిర్మాణం కొనసాగుతోంది. భారీ షెడ్డు నగరంలో ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సిన అనుమతులు, రుసుములు, ఆవశ్యకత, అక్కడ ఏర్పాటు చేయాలో వద్దా అనే ఆంక్షలు, నియమ నిబంధనలు అనేకం ఉంటాయి. కానీ కొండాపూర్ లో నిబంధనలకు విరుద్ధంగా, తన అధికార బలాన్ని ఉపయోగించి భారీ వాణిజ్య షెడ్డును సదరు నాయకుడు నిర్మిస్తుండగా, జిహెచ్ఎంసీ అధికారులు సైతం సదరు నిర్మాణం మీద చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. కొంతమంది కిందిస్థాయి జిహెచ్ఎంసీ సిబ్బందిని తన ధనబలంతో మచ్చిక చేసుకున్న నాయకుడు నిర్మాణాన్ని యథేచ్ఛగా పూర్తి చేస్తున్నాడు. సదరు నిర్మాణం వద్ద తన ప్రైవేట్ సైన్యాన్నీ పెట్టి, స్థానికులను, అక్రమ నిర్మాణంపై నిలదీసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎవరైనా నిర్మాణం ఫోటోలు తీసేందుకు వెళ్లినా అక్కడ తిష్ట వేసిన నాయకుడి అనుచరులు దాడులకు దిగుతున్నారు.

గతంలో చెరువుల కనుమరుగులో…
ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఆదాయాన్ని కొల్లగొడుతున్న సదరు నాయకుడు, అతని కుటుంబ సభ్యులు గతంలో మజీద్ బండలో ఉన్న రెండు చెరువులను కనుమరుగు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మజీద్ బండ పరిధిలోని మజీద్ బండ చెరువు అన్యాక్రాంతంలో, జంగమన్ కుంట కనుమరుగు కావడంలో ఈ నాయకుడిదే ప్రధాన పాత్ర అని స్థానికంగా చర్చ సాగుతోంది. శేరిలింగంపల్లికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిదికి బందువైన ఈ నాయకుడు తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చట్టం రాజకీయ నాయకుల చుట్టం కాదని… సామాన్యులకు, రాజకీయ నాయకులకు నిబంధనలు సమానమేనని నిరూపించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణం ఎంతటి వారు చేపట్టినా చర్యలు తీసుకునే ధైర్యం తమకు ఉందని నిరూపించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.