
పటాన్ చెరు, నిఘా 24 : అదో పెద్ద పేరుగాంచిన మేజర్ గ్రామపంచాయతీ. రియల్ ఎస్టేట్లో రాష్ట్రంలోనే పేరొందిన రిచ్ విలేజ్… అంతే స్థాయిలో రియల్ మోసాలు, ప్రభుత్వ భూముల కబ్జాలలో సైతం ఆ గ్రామం పేరు మారుమ్రోగుతుంది. ప్రభుత్వ అధికారుల అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్న ఆ గ్రామం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామం. గ్రామ పరిధిలో జరుగుతన్న అక్రమాలు అంతా ఇంతా కావు. గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే నిర్మించిన వేలాది బిల్డింగులకు పర్మిషన్లు లేకపోవడం ఇక్కడి అధికారుల అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికారుల అవినీతికి తోడు కొందరు అధికార బీఆర్ఎస్ లీడర్ల మాయాజాలం ఇందుకు కారణంగా నిలుస్తుంది. స్థానిక నాయకులకు ముడుపులు ముట్టజెప్పి, అధికారుల చేతులు తడిపితే చాలు.. ప్రభుత్వ స్థలంలోనైనా దర్జాగా భవంతులు నిర్మించుకోవచ్చు. అక్రమ కట్టడాల సంగతి పక్కన పెడితే ఊరి నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కానీ నోరు మెదపడం లేదు. ఊరు పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం, ప్రస్తుతం ప్రైవేట్ భూమిగా మారిపోయి దర్జాగా నిర్మాణాలు సాగుతుండడం చూసిఅందరూ నోటిన వేలేసుకుంటున్నారు.

ప్రైవేట్ సర్వే నంబర్లు చూపించి ప్రభుత్వ భూమికి ఎసరు…
కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఈద్గా ముందు ఉన్న స్థలం ఊరు పుట్టినప్పటినుండి ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ సర్వే నెంబరు 164లో సదరు స్థలం ఉండగా, పక్కనే ఉన్న 165, 166 సర్వే నెంబర్ల పేరుతో అర ఎకర స్థలాన్ని కొంతమంది ఆక్రమణకు పాల్పడుతున్నారు. అధికారులు, అధికార పార్టీ లీడర్ల సహకారంతో ఆక్రమించిన ప్రభుత్వ స్ధలంలో ఇప్పటికే రెండు నిర్మాణాలు మొదలుపెట్టగా, వాటి ఎదురుగా ఇటీవల మరో రెండు నిర్మాణాలను సైతం ప్రారంభించారు. మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు చదును చేసి సిద్ధంగా ఉంచారు. ఇంతా జరుగుతున్నా అధికారులు అటు వైపు చూడకపోవడం గమనార్హం.

మరో ఎకరా స్థలానికి స్కెచ్…
కిష్టారెడ్డిపేటకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి మరో అడుగు ముందుకేసి ఎకంగా ఎకరా భూమికి ఎసరు పెట్టాడు. లావణ్య పట్టా భూములను ఆక్రమించి ఎకరా స్థలాన్ని చదును చేసి అక్కడ నిర్మాణాలు చేసేందుకు సిద్ధంగా ఉంచాడు. రాత్రి వేళల్లో జేసీబీలతో పనులు చేస్తూ సదరు స్థలాన్ని కబ్జాలోకి తీసుకున్నాడు. చుట్టూ భారీ ప్రహారీని నిర్మించి, లోపల రోడ్లు కూడా వేశాడు. లావణ్య పట్టా స్థలాన్ని కబ్జాలోకి తీసుకున్నాడని ప్రశ్నించిన స్థానికులకు గుడి కట్టిస్తానని లోపాయకారి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా, బహిరంగంగా ఆక్రమిస్తున్నా ఏ ఒక్కరూ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కిష్టారెడ్డి పేట ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు.