
హైదరాబాద్ : ఆమెను నమ్మితే ఇక అంతే సంగతులు అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇంటర్నెట్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు సేకరించడం… మాట్రిమోనిలో నకిలీ పేరుతో ఐడి క్రీయేట్ చేయడం.. ఎన్అర్ఐ పెళ్లికొడుకులకు వల వేయడం… వారి వద్ద నుంచి దొరికినకాడికి కాజేయడం… ఇదీ కిలాడీ లేడి పన్నాగం.
పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐలను మోసం చేస్తున్న మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ వ్యక్తి నుండి డబ్బులు వసూళు చేసి మోసం చేసిన ఓ మహిళను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరు జిల్లాకు చెందిన కొర్రం అర్చన(30) ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. అదే జిల్లాకు చెందిన దుర్గప్రవీణ్ అనే లెక్చరర్‌ను 2016లో వివాహం చేసుకుంది. నగరానికి వలస వచ్చి బేగంపేట్‌లోని వైభవ్ లేడీస్ హాస్టల్లో నివాసం ఉంటుంది. ఇజీగా డబ్బులు సంపాధించాలనే ఉద్దేశ్యంతో మ్యాట్రీమోనీ వెబ్సైట్లో ఫేక్ ఫోటోలు పెట్టి, నకిలీ ఐడి ని క్రీయేట్ చేసింది. అమెరికాలో సెటిల్ ఐన ఇద్దరు భార్యభర్తలు తమ కుమారుడికి పెళ్లి చేయాలని అందుకు మంచి తెలుగు అమ్మాయిని కోసం ఆన్లైన్లో మ్యాట్రిమోనీ వెబ్సైట్లో వెతికారు. వీరికి పుస్తయి పేరుతో అర్చన నకిలీ ఐడి కనబడింది. వారు ఆమెను ఆన్ లైన్లో సంప్రదించారు. వారి కుమారున్ని పుస్తయి అనే పేరుతో అర్చన పరిచయం చేసుకొని తాను పెళ్లి చేసుకోవడానికి సిద్దమే అని వారిని ఒప్పించింది. ఇలా వాట్సప్‌లో ఫేస్బుక్లో ఒకరి ఒకరు మెసెజ్‌లు పెట్టుకోవడం, ఫోటోలు పంపించుకోవడం మొదలుపెట్టారు. తర్వాత తన కుటుంబ సమస్యలను, ఆర్థిక సమస్యలను ఎన్ఆర్ఐ యువకునికి చెబుతూ నమ్మించింది. ఆమె చెప్పిన మాటలు నమ్మిన ఎన్ఆర్ఐ యువకుడు పెళ్లికి చీరలు కొనుగోలు చేయాలి, నిశ్చితార్ధానికి గోల్డ్రింగ్, ప్లాటినం రింగు కొనుగోలు చేయాలని అందుకు డబ్బులు పంపించు అని పట్టుబడడంతో రూ. 1,50,000 పంపించాడు. ఆ తర్వాత అర్చన నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో అమెరికా నుండి చెన్నైలో నివాసం ఉంటున్న అర్చన ఇంటికి వచ్చారు. అది ఫేక్ అడ్రస్ అని తెలుసుకొని తాము మోసపోయామని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్స్ పోలీసులు అర్చనను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమె వద్ద నుండి 10 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 16 బ్యాంకు చెక్కులు, 34 ఏటిఎం కార్డులు, 2 పాన్ కార్డులు, 7 మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ…
డబ్బులు ఈజీగా సంపాధించాలానే దురుద్ధేశ్యం తో అర్చన గతంలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడింది. ఎన్ఆర్ఐల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి బుట్టలో వేసుకొని వారి నుండి డబ్బులు వసూళు చేస్తూ మోసాలకు పాల్పడేది. దీంతో ఈమెపై సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ సైబర్ క్రైమ్పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 5 నెలల పాటు చంచల్‌గూడ జైలులో జైలు శిక్ష అనుభవించి 2018లో విడుదలైంది. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా తిరిగి మోసాలకు పాల్పడడం మొదలుపెట్టింది. ఇలా పదుల సంఖ్యలో ఎన్ఆర్ఐలను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.