
హైదరాబాద్, నిఘా24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల వేలం కాసులు కురిపిస్తుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లోని గోల్డెన్ మైల్ లేఔట్ లో 14.91 ఎకరాలను శుక్రవారం వేలం వేయగా 729.41కోట్ల రూపాయలకు 4 సంస్థలు ఈ భూములు దక్కించుకున్నాయి. ఈ లేఔట్ లో ఉన్న మొత్తం 5ప్లాట్లను అత్యధికంగా 55కోట్లకు ఎకరా చొప్పున, అత్యల్పంగా 43.60కోట్లకు ఎకరా చొప్పున అమ్ముడుపోయాయి. టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో గోల్డెన్ మైల్ లేఔట్ వేలంలో ప్లాట్ నంబర్ 14లోని 2.92 ఎకరాలను 55కోట్లకు ఎకరా చొప్పున మంజీరా సంస్థ కొనుగోలు చేసింది. ప్లాట్ నంబర్ 12లోని 3.69ఎకరాలను 50.40కోట్లకు ఎకరా చొప్పున జీవిపిఆర్ సంస్థ, ప్లాట్ నెంబర్ 4లోని 3.15ఎకరాలను 48.60కోట్లకు ఎకరా చొప్పున లింకువెల్ సంస్థ దక్కించుకున్నాయి. ప్లాట్ నెంబర్ 17లోని 2 ఎకరాలను 46.20కోట్లకు ఎకరా చొప్పున లింకువెల్ సంస్థ, ప్లాట్ నెంబర్ 6లోని 3.15ఎకరాలను 43.60కోట్లకు ఎకరా చొప్పున అప్ టాన్ సంస్థలు వేలంలో దక్కించుకున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో కోకాపేట భూములు 49.2 ఎకరాలు 2వేల కోట్లు ధర పలుకగా, శుక్రవారం నిర్వహించిన ఖానామెట్ భూములు కేవలం 14.91 ఎకరాలే 729.41 కోట్ల రెవెన్యూను ఆర్జించిపెట్టాయి.