
శేరిలింగంపల్లి, నిఘా24: అక్రమ మార్గాన ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్కారీ జాగా కబ్జాకు యత్నించిన ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమిస్తే ఏకంగా జిహెచ్ఎంసి అక్రమ ఇంటి నెంబర్లు, తహశీల్దార్ సంతకం ఫోర్జరీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం…
శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగుడ సర్వే నెంబరు 27లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానికంగా ఉండే సంగం రాజుగౌడ్, కొమరగౌని శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ లు పథకం వేశారు. ఇందులో భాగంగా సదరు సర్వే నెంబరు లోని 611 గజాలకు రెండు ఇంటి నెంబర్లను సృష్టించారు. 150 గజాలకు 3-71/5 నెంబరును, 461 గజాలకు 2-61/3లను సృష్టించి, వీటి ద్వారా మొత్తం 611 గజాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం శేరిలింగంపల్లి ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి సదరు స్థలం గ్రామ కంఠం అంటూ జిహెచ్ఎంసి నుంచి భవన నిర్మాణ అనుమతి పొందారు. గత నెలలో సదరు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకొని కూల్చి వేశారు.
కాగా విచారణలో అక్రమ ఇంటి నెంబర్లు, తహశీల్దార్ సంతకం ఫోర్జరీ విషయాలు బయటపడటంతో శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఖాజాగూడకు చెందిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ లను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.