
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగుడ సాయి ఐశ్వర్య కాలనీలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో జూలై 1వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. కాలనీలోని పురాతన దేవాలయాన్ని పునర్నిర్మించి సుందరంగా తీర్చిదిద్దారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకున్న శిల్పి బాలు ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయం, శివాలయం, నాగదేవత ఆలయాలను నిర్మించారు. కొమిరిశెట్టి పౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా 28వ తేదీ నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.

జూలై 1వ తేదీన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, శివాలయంలో అరుదైన మరకత లింగం ప్రతిష్టాపన జరుపనున్నారు. దీంతోపాటు చండీ హోమం, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన నిర్వహించనున్నట్లు కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. దేవాలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో నిర్మాణం చేపట్టడం జరిగిందని, శివాలయంలో అరుదైన 170 కిలోల మరకత లింగాన్ని ప్రతిష్టిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, కొమిరిశెట్టి వేణు, కొమిరిశెట్టి జ్ఞానేశ్వర్, కొండా దేవన్న తదితరులు పాల్గొన్నారు.