
హైదరాబాద్, నిఘా24: శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ సాయి ఐశ్వర్య కాలనీలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారు, శివలింగం ప్రతిష్టాపన మహోత్సవం శ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా గురువారం వైభవంగా నిర్వహించారు. కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వారి కుటుంబ సభ్యుల సహకారంతో సాయి ఐశ్వర్య కాలనీలో ఈ నూతన దేవాలయం నిర్మాణం చేపట్టారు. గత రెండు రోజులుగా విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించగా, గురువారం జీయర్ స్వామి చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ముత్యాలమ్మ అమ్మవారు విగ్రహం, అరుదైన 170 కిలోల మరకత శివలింగం ప్రతిష్టాపన చేపట్టారు.

దీంతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ట చేపట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు చిన్న జీయర్ స్వామి ఉపదేశం వినిపించడంతో పాటు భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, సభ్యులు కొమిరిశెట్టి వేణు, కొమిరిశెట్టి జ్ఞానేశ్వర్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.